శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (15:53 IST)

హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ఏడుగురు మృత్యువాత... రూ.2 ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తి పోశాయి. ఫలితంగా పెను విషాదం నెలకొంది. బుధవారం ఉదయం 2 గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తి పోశాయి. ఫలితంగా పెను విషాదం నెలకొంది. బుధవారం ఉదయం 2 గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. రామాంతపూర్ ప్రగతి నగర్‌లో భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో దంపతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు బాలస్వామి, చిన్నమ్మ, శ్రీకర్, పార్వతిగా గుర్తించారు.
 
అలాగే, భోలక్‌పూల్‌లో పాత ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. ఇంట్లో నివసిస్తున్న తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరుగురుపొరుగు వారు ఇళ్లు శిథిలాలను తొలగించి తల్లీ, పిల్లలను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతులను బిల్‌కిష్‌ ‌(26), మారియా(3), జేబా ఫాతిమా(2)గా గుర్తించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ విచారం వ్యక్తం చేశారు.  
 
ఇదిలావుండగా, నగరంలో భారీ వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం మునిసిపల్‌ మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీపీతో సీఎం మాట్లాడారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్, అధికారులను ఆదేశించారు.