ఇంటిపై నీటి ట్యాంకులో రెండేళ్ళ చిన్ని మృతదేహం...
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో రెండు నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది. రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన బాలుడు తెల్లారే సరికి నీటి తొట్టిలో శవమై కనిపించాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు మాదిరిగా గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు.
తెల్లవారుజాము నుంచి బాలుడు కనిపించట్లేదని గాలించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాజ్‌పూర్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా పోలీసులుకు ఎలాంటి ఆచూకి లభించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు.
చివరకు ఇంటిపైన గాలించగా, నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ బాలుడిని మేనమామ, అత్తే హత్య చేసుంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని తెలిపారు. ఘటనాస్థలిని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.