రెండో పెళ్లి చేస్కోండి.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సిద్ధం..
తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల వివాహాల కోసం ఇబ్బందులు పడకుండా టి.సర్కారు ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే తాజాగా రెండో పెళ్లికి కూడా ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
పెళ్లైన మహిళలు విడాకుల ద్వారా కానీ లేక భర్త చనిపోయినా, లేక వేరే కారణాలతో భర్తతో వేరుగా ఉండే పేద యువతులకు ఆసరాగా నిలబడేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది.
అలాంటి మహిళలు రెండో వివాహం చేసుకోవాలని భావిస్తే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఈ పథకం అంతకుముందు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిపొందనివారికే ఈ అవకాశం దక్కనుందని తెలంగాణ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది.