గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 18 నవంబరు 2019 (18:48 IST)

కేసీఆర్ నాయకుడు కాదు... నియంత: కృష్ణ సాగర్ రావు

ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటల్లోనే... హరీష్ రావు ఎక్కడ ఉన్నవయ్యా? నువ్ ఉద్యమకారుడవేనా? 
 
ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో చెంపలు పగిలేలా కొట్టావ్, ఈరోజు ఏమైంది నీ పౌరుషం? మంత్రి ఈటెల రాజేందర్ ఓనర్‌షిప్ గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడినవ్ కదా? కార్మికులు చనిపోతుంటే మాట్లాడరా? అవకాశవాద రాజకీయాల కోసం, ఇతర పార్టీలిచ్చే పదవుల కోసం, అధికారం కోసమే తిరుగుబాటు చేస్తారా?
 
ప్రజాస్వామ్యంలో ప్రజలు, లక్షలాది మంది ఉద్యోగుల హక్కులు ప్రమాదంలో ఉంటే తిరుగుబాటు చేయరా? సునీల్ శర్మ లాంటి అమ్ముడుపోయిన అధికారిని జైల్లో పెట్టాలి. ఈరోజు కోర్టులో ఆవిధమైన తీర్పు వచ్చిన ఆశ్చర్యపోము. సునీల్ శర్మ కోర్టుకు ఇచ్చిన అఫడేవిట్ ఆయన రాజకీయ బానిసత్వానికి అద్దం పడుతోంది.
 
నక్సలైట్లతో చర్చలు చేసిన రాష్ట్రం.. సీఎం కేసీఆర్ కార్మికులతో చర్చలు జరుపడానికి ఎందుకు భయపడుతున్నారు. సీఎం స్థాయిని కేసీఆర్ తగ్గించారు. కేసీఆర్ నాయకుడు కాదు. నియంత. ప్రజా నాయకులంటే వాజపేయి, అద్వానీ, నరేంద్రమోడీ లాంటి వారు. ప్రతి నిమిషం ప్రజల కోసం బ్రతికేవారు. ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే వారు. 
 
నాయకుడెప్పుడు నియంత కాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తన ముసుగు తొలగించి అసలు రూపం చూపిస్తున్నారు. కేసీఆర్ తన సహచరులను కూడా బానిసలను చేశాడు. సమర్ధత లేని నాయకుడు ఎప్పుడు నియంతలా మారతారు. 
 
సమర్ధవంతమైన నాయకుడు ప్రజలను, సహచరుల గౌరవాన్ని పొంది గొప్పనాయకుడవుతాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్ధత లేదన్నది వాస్తవం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడాలి. ప్రజల నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. ఎంతో చైతన్యవంతమైన తెలంగాణలో ఇంత స్తబ్దత ఏంటి?
 
ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదు? మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కులసంఘాలు, ప్రజాసంఘాలు, మహిళ సంఘాలు, చిత్ర పరిశ్రమ, ఇతర సంఘాలు ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వాన్ని ఖండించాలి. వీరి నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.