శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:57 IST)

ముగ్గురు మహిళా పోలీసులు... మూడు తప్పులు.. ఏంటవి?

సమాజం కోసం బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముగ్గురు మహిళా పోలీసులు మూడు తప్పులు చేశారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అపరాధం విధించారు. ఇంతకీ ఆ ముగ్గురు పోలీసులు చేసిన తప్పులేంటో తెలుసుకుందాం. 
 
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ ముగ్గురూ ఒకే స్కూటీ ఎక్కారు. శిరస్త్రాణాం ధరించలేదు. పైగా రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో సంభాషించారు. ఇలా ట్రాఫిక్‌ నిబంధనల పరంగా ఒకటి కాదు.. మూడు ఉల్లంఘనలకు పాల్పడిన తీరుపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 
ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఈ ముగ్గురూ విధులు నిర్వహించేందుకు ఇలా ఒకే బైక్‌ మీద వెళ్లారు. వీరు ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో నుంచి వెళుతుండగా కొందరు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. 
 
గత రెండ్రోజులుగా ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా మహిళా కానిస్టేబుళ్ల ఈ నిర్లక్ష్యంపై ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ సీరియస్‌ అయ్యారు. వారికి రూ.3300 జరిమానా విధించాలని, అలాగే శాఖాపరమైన చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.