సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (17:41 IST)

కాంగ్రెస్ పార్టీకి కొండా రాజీనామా... త్వరలో బీజేపీ తీర్థం

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బతగింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా విషయమై తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
పైగా, ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు అనుచరులకు సమాచరం చేరవేశారు. నిజానికి గత ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరాలని భావిస్తూ వచ్చారు. ఆ ఊహాగానాలకు నేటితో తెరపడినట్లు అయ్యింది. 
 
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 
 
అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన ఆయన.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై తనదైన శైలిలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ముందుంటారు. తెలంగాణ రాజకీయాల్లో కొండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.