శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (12:55 IST)

టీడీపీకి రాజీనామా చేసిన ఎల్.రమణ... కారులో సీటు రిజర్వు

తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ అధికార తెరాసలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపించారు. 
 
కాగా, తెరాసలో చేరే విషయంపై రమణ గుురువారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపిన విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారాల‌ని తుది నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ నేటితో టీడీపీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.  
 
టీఆర్ఎస్‌లో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు రమణ శుక్రవారం అధికారికంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడికి ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, టీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని ఎల్.ర‌మ‌ణ‌కు కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఆ పార్టీలో చేరేందుకు రమణ అంగీకరించారు. త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ అధికార కార్యాల‌యం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 
 
టీఆర్ఎస్ నుంచి కీల‌క బీసీ నేత ఈట‌ల రాజేందర్ బీజేపీలో చేర‌డంతో, ఎల్.ర‌మ‌ణ వంటి బీసీ నాయ‌కుల అవస‌‌రం ఉంద‌ని భావించిన టీఆర్ఎస్ ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుంటోంది. టీఆర్ఎస్‌లో చేరి బీసీల కోసం కృషి చేయాల‌ని ఆయ‌న‌కు కేసీఆర్‌ సూచన‌లు చేశారు.