లాక్‌డౌన్ మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్ని తీసుకోమంటారా? తెలంగాణ సర్కార్ పైన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. రాగల 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలనీ, లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చీఫ్ జస్టిస్ అన్నారు.
ఆర్‌టిపిసి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. Health.telangana.gov.in వెబ్‌సైట్లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని సూచించింది.
ఇంకా పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలు భారీగా గుమిగూడకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదిక అసంపూర్తిగా వుందని, మరోసారి సమగ్రమైన నివేదికను కోర్టుకి సమర్పించాలని విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.