త్రివర్ణ పతాక వేడుకల్లో ప్రసంగిస్తూ కుప్పకూలి తుదిశ్వాస విడిచిన ఫార్మా వ్యాపారి
హైదరాబాద్ నగరంలో పంద్రాగస్టు రోజున విషాదం జరిగింది. నగరంలోని ఉప్పల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫార్మా వ్యాపారి ఒకరు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత మైక్ తీసుకుని ప్రసంగిస్తూనే కిందపడి తుదిశ్వాస విడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ వంపుగూడలో లక్ష్మీ ఇలైట్ విల్లాస్ కాలనీలో సోమవారం ఉదయం త్రివర్ణ పతకాన్ని ఎగువేశారు. ఆ తర్వాత ఫార్మా వ్యాపారి ఉప్పల సురేష్ (56) ప్రసంగం మొదలుపెట్టారు. స్వాత్రంత్య ఉద్యమం, అందుకోసం నెత్తురు చిందించిన వీరుల గురించి ప్రసంగిస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కాలనీవాసులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే ఆయన మరణించినట్టు తెలిపారు. ఉప్పల సురేష్ జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్‌కు చెందినవారు. పాతికేళ్ల క్రితమే ఆయన హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.