తెలంగాణాలో ఎంబీబీఎస్ వైద్య కోర్సు ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యా కోర్సు ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీచేసింది. ఇందులోభాగంగా, ఆదివారం తొలి విడత విద్యార్థుల ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి నవంబరు ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించినట్టు కాళోజీ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అయితే, తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
కళాశాల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం www.knrhs.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపింది.