శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (10:50 IST)

మెట్రో ప్రయాణికులకు శుభవార్త : ఉదయం 6 నుంచే మెట్రో సేవలు

హైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో సేవలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. వాస్తవంగా నగరంలో రాత్రుళ్లు, తెల్లవారుజామున సరైన ప్రజా రవాణా వనరులు లేక ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మెట్రో రైలు రాకపోకల్లో మార్పులు చేయాలంటూ నగర ప్రజలు ఎంతోకాలం నుంచి కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా తాము చర్యలు తీసుకుంటామంటూ మెట్రో రైలు అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు.
 
ఈ సమస్యకు ఇపుడు ఓ ట్వీట్ రూపంలో పరిష్కారం లభించుంది. అభినవ్‌ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రోరైలు ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా ట్యాగ్‌ చేశారు. 
 
తెల్లవారుజామునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అభినవ్‌ మాటలతో ఏకీభవిస్తున్నట్టు రీట్వీట్‌ చేశారు. మెట్రో ఎండీ స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.