బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (13:20 IST)

25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక : వెల్లడించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25వ తేదీన జరుగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పార్టీ నియమావళి మేరకు రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులోభాగంగానే ఈ నెల 25వ తేదీన ఎన్నిక నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు.  23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని చెప్పారు. 25న తెరాస అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. 
 
నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు.