శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:43 IST)

మా నాన్న చనిపోయింది కరోనాతో కాదు, సున్నం రాజయ్య తనయుడు వ్యాఖ్య

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. అయితే ఆయన కుమారుడు విడుదల చేసిన  ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరుపెట్టారని తెలిపారు.
 
కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మా అక్కకు కరోనా సోకింది. దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నపుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు. దీంతో ఆయన మానసికంగా కృంగిపోయారని, తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని దీంతో ఆయన విపరీతమైన ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.
 
ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్కకాదని తెలిపారు. ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం చేయడం తట్టుకోలేకపోయారన్నారు. ప్రజలు పలకరించి ధైర్యం చెప్పి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జనాల్లో సరైన అవగాహన కల్పించలేదన్నారు.