శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (12:35 IST)

దేశంలో కరోనా విలయతాండవం : ఒకే రోజు 62 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 62 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో 62538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,27,075కు చేరాయి. 
 
ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 886 మంది కరోనాతో మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. తాజాగా న‌మోద‌వుతున్న పాజ‌టివ్ కేసుల్లో దాదాపు 38 శాతం ఆంధ్రప్రదేశ్, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
 
ప్రస్తుతం ఇండియా కరోనా కేసుల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అమెరికా 49.91 లక్షల కేసులతో మొదటిస్థానంలో ఉండగా, 28.73 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రెజిల్ కంటే కూడా భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.