గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (17:30 IST)

నాగార్జున సాగర్‌లో కారు దూకుడు.. నోముల భగత్ ఘన విజయం

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తెరాస విజయభేరీ మోగించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18,804 ఓట్ల‌ మెజార్టీతో గెలుపొందారు. 
 
దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే.
 
నోముల భ‌గ‌త్ ప్ర‌తి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం క‌న‌బ‌రిచారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యాన్ని చూపించారు. 
 
అయితే, మ‌ళ్లీ మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. కారు వేగానికి హ‌స్తం, క‌మ‌లం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.
 
ఈ ఎన్నిక‌లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ డిపాజిట్ గ‌ల్లంతు అయింది. టీఆర్ఎస్ స‌ర్కార్‌ను బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ఎంతగా విమ‌ర్శించిన‌ప్ప‌టికీ.. వారి మాట‌ల‌ను సాగ‌ర్ ఓట‌ర్లు న‌మ్మ‌లేదు. 
 
బండి సంజ‌య్ అబద్దాల‌ను, అడ్డ‌గోలు వాద‌న‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి క‌లిసి ప్ర‌భుత్వంపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన టీఆర్ఎస్ స‌ర్కార్ ప‌క్షానే సాగ‌ర్ ప్ర‌జ‌లు నిలిచారు.