శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (11:28 IST)

సాగర్‌ బై పోల్ : కారు దూకుడుకు పత్తాలేని జానారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో తెరాస పార్టీ మంచి జోరు మీద ఉంది. తొమ్మిదో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ముందంజ‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి జానారెడ్డి ఏ రౌండ్‌లోనూ ఆధిక్యం క‌న‌బ‌ర‌చ‌లేదు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది రౌండ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ.. ఏ రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముఖాలు వాడిపోయాయి. ఆ పార్టీ నాయ‌కులంద‌రూ విస్తృతంగా ప్ర‌చారం చేసి, ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ.. టీఆర్ఎస్ పార్టీ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపార‌న్న విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. 
 
ఈ ఉప ఎన్నిక‌లో దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్‌ను సాగ‌ర్ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తున్నారు. మ‌రికాసేప‌ట్లో సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం వెలువ‌డ‌నుంది.
 
కాగా, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. 
 
నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,202 ఓట్లు వ‌చ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్‌కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి. 
 
ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వ‌చ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోల‌య్యాయి. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.