ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:42 IST)

రెండు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లు, వరంగల్‌కు తరుణ్‌జోషి.. ఖమ్మంకు విష్ణు వారియర్‌

రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. వరంగల్‌ కమిషనర్‌గా తరుణ్‌జోషిని, ఖమ్మం కమిషనర్‌గా విష్ణు ఎస్‌.వారియర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు వరంగల్‌లో ప్రమోద్‌కుమార్‌, ఖమ్మంలో తఫ్సీర్‌ ఇక్బాల్‌ కమిషనర్లుగా పనిచేశారు. త్వరలో వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా బదిలీలకు ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రమోద్‌కుమార్‌ సీఐడీ ఐజీగా, కరీంనగర్‌ ఇన్‌ఛార్జి డీఐజీగా ఉంటూ తొమ్మిది నెలల క్రితమే వరంగల్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లోనే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా ఇప్పుడు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆయన సీఐడీ ఐజీ, కరీంనగర్‌ ఇన్‌ఛార్జి డీఐజీగా కొనసాగనున్నారు. తఫ్సీర్‌ ఇక్బాల్‌కు ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాగా.. తరుణ్‌జోషి ఇప్పటివరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఎస్‌బీ విభాగం సంయుక్త కమిషనర్‌గా, విష్ణు ఎస్‌.వారియర్‌ ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేశారు.