గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 మే 2023 (16:40 IST)

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కాల్పుల కలకలం

gunshot
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. తన వాహనంపై దొంగలు దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్ఐ గాల్లోకి కాల్పులు జరిపారు. సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముప్కాల్ మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ కాయిల్‌ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్థరాత్రి సమాచారం వచ్చింది. దీంతో ఇందల్వాయి ఎస్ఐ నరేశ్, దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణా రెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద వాహనాలను తనిఖీ చేశారు.
 
ఆ సమయంలో పోలీసులను చూసిన దొంగల ముఠా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమ కారుతో దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎస్ఐను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయినట్లు ఇందల్వాయి ఎస్ఐ నరేశ్‌ తెలిపారు. అంతర్‌రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.