శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:51 IST)

హైదరాబాదులో మళ్లీ భూ ప్రకంపనాల మోత, భయాందోళనలో భాగ్యనగర వాసులు

హైదరాబాదు నగరాన్ని ఓ వైపు వర్షాలు ముంచెత్తుతుంటే ఇంకోవైపు భూ ప్రకంపనాలు ప్రజలను వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాదు నగరంలో తరుచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నగరంలో మరోసారి భూకంపం సంభవించింది. అయితే ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
 
వైదేహీ నగర్ కాలనీల్లో భారీ శబ్దాలతో భూమి కంపించింది. తెల్లవారు ఝామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సుమారు 5.45 నిమిషాలకు భారీ శబ్దంతో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా ఉదయం 6.40, 7.08 నిమిషాలకు కూడా మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసారు.
 
ఈ భూకంపం తాకిడికి కొందరి ఇళ్లలో శ్లాబ్ పైపెచ్చులు ఊడిపడిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుండి పరుగులు తీయసాగారు. కానీ ఎవరికీ ప్రమాదం సంభవించలేదని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తివారి తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలనీల్లోకి పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ భూకంప వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.