మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (11:39 IST)

కొడంగల్ బిగ్‌ఫైట్ : రేవంత్ ఓటమికి కేసీఆర్ పట్టు... మేనల్లుడుకి బాధ్యతలు

అనుమోలు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌. మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ నేత. ఇపుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. తెరాస అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబంపై ఒంటికాలిపై విరుచుకుపడే చిచ్చరపిడుగు. అలాంటి నేతను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపించకుండా చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఫ్యామిలీ కంకణం కట్టుకుంది. ఇందుకోసం పక్కా వ్యూహరచన చేసింది. 
 
పైగా, రేవంత్ రెడ్డికి కంచుకోటగా ఉన్న కొడంగల్ స్థానం గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా నిలువరించిన కేసీఆర్.. ఈ దఫా ఏకంగా అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని బరిలోకి దించారు. ఆయన గెలుపు బాధ్యతలను హరిష్ రావుకు అప్పగించారు. దీంతో కొడంగల్ స్థానం ఎన్నికలు బిగ్‌ఫైట్‌గా మారాయి. 
 
నిజానికి 2014 వరకూ కొడంగల్ స్థానంపై ఏ ఒక్క ప్రభుత్వమూ పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ, ఇపుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం. దీనికి కారణం ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతుండటం, ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో కేసీఆర్ అండ్ కో ఉండటమే. 
 
త్వరలో జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ యేడాది కాలంగా పక్కా ప్రణాళికను రచించారు. ఇందుకోసం మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని తెరాస అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది. తెరాస సర్కారు చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో నరేందర్ రెడ్డి ఉంటే, తనకున్న ప్రజాభిమానంతోనే మళ్లీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటానన్న బలమైన నమ్మకంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇందుకోసం వారిద్దరూ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ, కరెన్సీ కట్టలను ఏరులై పారించనున్నారు. ఫలితంగా రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఎన్నికల్లో కొడంగల్ స్థానం ఒకటిగా చేరనుంది.
 
కొడంగల్ స్థానంలో రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం అధికం. కానీ, ఓట్ల శాతం తక్కువ. అయితే, మెజార్టీ ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం వారి సొంతం. ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములు బలహీన, గిరిజన, మైనార్టీ ఓటర్లే శాసిస్తున్నారు. ఈ స్థానంలో బీసీ ఓటర్లు 95 వేలు, ఎస్సీలు 38 వేలు, రెడ్లు ఇతర అగ్రకులాలు 15 వేలు, ఎస్టీలు 35 వేలు, మైనార్టీలు 15 వేలు చొప్పున ఉన్నారు. 
 
గత 2014 ఎన్నికల్లో మొత్తం 1,94,354 ఉండగా, 1,38,322 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రేవంత్‌ రెడ్డికి వచ్చిన ఓట్లు 54,026 (39.06 శాతం), తెరాస అభ్యర్థి గురునాథ రెడ్డికి 39,412 (28.05 శాతం), కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ రావుకు 36,304 (26.24 శాతం) చొప్పున వచ్చాయి.