మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత - సిటీ న్యూరో ఆస్పత్రిలో అడ్మిట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు మూర్ఛ రావడంతో తక్షణం హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని న్యూరో సిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షలను చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక మీడియా బులిటెన్ విడుదల చేయనున్నారు.
ఇదిలావుంటే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదేసమయంలో ఆయనకు ఢిల్లీలో ఆదరణ తగ్గింది. దీంతో ఆయన తెరాస పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ రాజ్యసభ టిక్కెట్ ఆశ చూపడంతో ఆయన పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
అయితే, అక్కడ ఆయన ఇమడలేక పోయారు. సొంత పార్టీ నేతలే ఆయన పొగబెట్టారు. దీంతో ఆ పార్టీకి కూడా దూరమై ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ మాత్రం తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా నిజామాబాద్ స్థానం నుచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.