మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నోరు జారిన ఈటల : హుజురాబాద్‌లో ఎగరబోయేది గులాబి జెండానే...

ఇటీవల తెరాస నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోరు జారారు. తాను రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను తప్పు మాట్లాడినట్టు తెలుసుకుని, కాషాయం జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. 
 
సాధారణంగా దశాబ్దాలుగా ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినపుడు రాజకీయ నేతలు అలవాటులో పొరపాటుగా నోరు జారడం, ఆపై నాలుక కరుచుకోవడం సహజమే. అలాగే, ఈటల రాజేందర్ కూడా తాజాగా పొరబడ్డారు. 
 
తన మాతృపార్టీ తెరాసను వీడి ఆయన బీజేపీలో చేరారు. ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.
 
సాధారణంగా పార్టీ మారిన కొత్తలో నేతలు నోరు జారుతుండడం సహజమే. అలాగే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా పొరపాటున నోరు జారారు. హుజురాబాద్‌లో ఎగరబోయేది గులాబి జెండా అని అనేశారు. 
 
అంతలోనే తన పొరపాటును గుర్తించి కాషాయ జెండా ఎగరబోతోందని సవరించారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు.
 
ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ముఖ్యమని… కులమతాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే అని స్పష్టంచేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు.