గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (16:33 IST)

తెలంగాణాలో బీజేపీని విస్తరిస్తాం... తెరాసను బొందపెడతాం : ఈటల ఫైర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, కీలక నేత ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఆ తర్వాత ఈటల నేతలతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లారు. అక్కడ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఢిల్లీలో మాట్లాడుతూ, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలిపారు. దక్షిణ భారత దేశంలో తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. బీజేపీలోకి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. 
 
మరోవైపు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఆయనకు అండగా ఉన్న తమలాంటి వారిపై కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతుండడాన్ని భరించలేక టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు కంటోన్మెంట్‌ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి ప్రకటించారు. తుర్కయంజాల్‌ భూముల విషయంలో ఈటలతోపాటు తమలాంటి ఎంతో మందిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
 
తాము ఏ తప్పూ చేయలేదని, నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కూడా తాము ద్రోహం చేయలేదన్నారు. కంటోన్మెంట్‌లో సాద కేశవరెడ్డి మొహం చూసి గడిచిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని, భారీ మెజారిటీ కట్ట పెట్టారని చెప్పారు.