గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By మోహన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:06 IST)

తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లా??

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్, దాదాపు మూడు నెలల పాటు మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేసారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసారు. అయితే ఈసారి ఆర్థిక శాఖను ఎవరికీ కేటాయించకపోవడంతో కేసీఆర్ స్వయంగా బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11.30గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 
 
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా అభివృద్ధి పథకాలకు సంబంధించి బడ్జెట్‌‌ ఉండే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ఓటాన్ బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నప్పటికీ, 12 నెలలకు అవసరమైన ప్రణాళికతో కూడిన బడ్జెట్ ఉండబోతోందని సమాచారం. ఈసారి బడ్జెట్ దాదాపు రెండు లక్షల కోట్లతో ఉండనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పన్ను వసూళ్లపై 28 శాతం వృద్ధి నమోదవుతుండడం వల్ల బడ్జెట్ కూడా పెరగనుంది. 
 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, రైతు బంధుకు అదనంగా రూ.2వేలు, ఆసరా ఫించన్ల రెట్టింపు, రైతులకు రూ.1లక్ష రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.