గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:37 IST)

ఒంటరిగా ఉన్న గిరిజన మహిళపై అత్యాచారం...

ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం కామారెడ్డికి సమీపంలోని ముత్యంపేట రోడ్డులో వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మహిళ తండాకు కొద్ది దూరంలోని ఓ రైస్‌మిల్‌ వద్ద చిన్న హోటల్‌ నడుపుతోంది. మంగళవారం ఉదయం హోటల్‌ నిర్వహిస్తున్న సదరు మహిళ తలకు బలమైన గాయాలతో అపస్మారక స్థితిలో హోటల్‌కు కొద్దిదూరంలో పడి ఉండటాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
 
అక్కడికి చేరుకున్న కామారెడ్డి రూరల్‌ పోలీసులు విచారించి వైద్య చికిత్సల నిమిత్తం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మహిళ ఒంటరిగా ఉండడం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 7 గంటలకు ఆమెపై దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒంటిపై దుస్తులు సరిగ్గా లేక లైంగికదాడికి ఒడిగట్టి ఉంటారని, ఆమె ప్రతిఘటించినట్లు ఇక్కడ విషయం తెలుస్తుందని హత్యాయత్నానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై కామారెడ్డి రూరల్‌ పోలీసులను సంప్రదించగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి సెక్షన్‌ 307 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. గాయపడిన మహిళ స్పృహలోకి వస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.