సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:19 IST)

ప్రమోషన్ ఇస్తే.. రూ.5 లక్షలిస్తా ... ఎవరికి ఎవరు ఆఫర్ చేశారు?

ప్రమోషన్ ఇస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఉన్నతాధికారికి ఓ ఉద్యోగి ఆఫర్ చేశాడు. ఈ విషయాని నోటి మాటగా చెప్పకుండా నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా పంపించాడు. దీంతో ఖంగుతిన్న ఆ అధికారి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ఇందులో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగినిగా బత్తిన సత్యనారాయణ గౌడ్ పని చేస్తున్నాడు. ఈయన ప్రమోషన్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రజారోగ్యశాఖ సంచాలకుడు(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావుకు ఎస్సెమ్మెస్ చేస్తూ.. ఐదు లక్షల రూపాయలు ఆఫర్ చేస్తూ మంగళవారం ఏకధాటిగా ఎస్సెమ్మెస్‌లు పంపాడు.
 
ఈ ఎస్ఎంఎస్‌లో "సర్.. చిన్న వినతి అంటూ తన ఎస్ఎంఎస్‌ను ప్రారంభించిన సత్యనారాయణ.. మెడికల్ సోషల్ వర్కర్ (ఎంఎస్‌డబ్ల్యూ)లో పదోన్నతుల పరంగా అన్యాయం జరిగిన ఇద్దరికి చొరవ తీసుకుని ప్రమోషన్ ఇప్పించాలని, అలా చేస్తే రూ.5 లక్షల వరకు తాను సర్దుబాటు చేస్తానని అందులో పేర్కొన్నాడు. 
 
ఈ విషయంలో ఎవరిని నమ్మాలో తెలియక, నేరుగా మిమ్మల్నే సంప్రదిస్తున్నానంటూ ఎస్సెమ్మెస్‌లో పేర్కొన్నాడు. త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని, ఈ క్రమంలో ఎవరైనా సీనియర్లు వస్తే ప్రమోషన్ తమ వరకు రాదని వారు భయపడుతున్నారని వరుసపెట్టి ఎస్సెమ్మెస్‌లు పంపాడు.
 
దీంతో ఏం చేయాలో తెలియని డీహెచ్ శ్రీనివాస రావు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె శాఖాపరమైన చర్యలు తీసుకుని సత్యనారాయణను సస్పెండ్ చేశారు.