సిరిసిల్ల వేదికపై నుంచి చెబుతున్నా.. కేసీఆర్ ప్రయాణాన్ని ఎవ్వడూ ఆపలేరు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నాం అంటూ ప్రకటించారు.
ఆయన ఆదివారం సిరిసిల్లా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నాం. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఫలితాలు మన ముందరే కాదు యావత్ ప్రపంచం ముందు కూడా ఉన్నవన్నారు.
మనకు అపనమ్మకాలు ఎక్కువ. కానీ లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఈ మూడు తోడైతే ఏదైనా వందశాతం అయితదని సీఎం అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉదాహారణ అని పేర్కొన్నారు.
పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సీంఎ ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సీఎం మీకు ఏది చేతకాదు అనే వాదనను ఖండించినట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం మన కండ్లముందు ఉందన్నారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలకు డిజైన్ చేసింది మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి అని వాటిని కడుతుంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సీఎం పేర్కొన్నారు.
కాగా, సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రగతి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.