1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (11:02 IST)

తెలంగాణాలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - జగిత్యాల డీఎస్పీ మృతి!

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గ‌త 24 గంటల్లో కొత్త‌గా 3018 మంది క‌రోనా వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు 1,11,688కు చేరాయి. 
 
మరోవైపు, మంగ‌ళ‌వారం 1060 మంది బాధితులు డిశ్చార్చి కాగా, ఇప్ప‌టివ‌ర‌కు కరోనా నుంచి కోల‌కున్న‌వారి సంఖ్య 85,223ల‌కు పెరిగాయి. ప్రస్తుతం 25,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగళవారం కొత్త‌గా 10 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 780కు పెరిగింది.
 
జగిత్యాల డీఎస్పీ మృతి 
ఇదిలావుండగా, కరోనా వారియర్స్‌లో పోలీసులు ముందున్నారు.. ఇప్పటికే పలువురు మహమ్మారి బారినపడగా కొందరు కోలుకోగా మరికొందరు మృత్యువాతపడ్డారు. తాజాగా జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణామూర్తి బుధవారం తెల్లవారుజామున కరోనాతో చనిపోయారు. 
 
గత వారం రోజులుగా ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. 1989 బ్యాచ్‌కు చెందిన దక్షిణామూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్‌తో పాటు వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్‌ దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో ఆయన పాల్గొన్నారు. 
 
కరీంనగర్ సవరన్‌ స్ట్రీట్‌కు చెందిన దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ, చివరకు ఆయనే కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారు. దీంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. 
 
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు 
దేశంలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతున్న‌ది. గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 60 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 32 ల‌క్ష‌లు దాటాయి. 
 
దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 67,151 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 32,34,475కు చేరింది. ఇందులో 7,07,267 యాక్టివ్ కేసులు న‌మోద‌ుకాగా, 24,67,759 మంది బాధితులు కోలుకున్నారు. 
 
మంగళవారం ఉద‌యం నుంచి బుధవారం  ఉద‌యం వ‌ర‌కు కొత్తగా 1059 మంది క‌రోనావ‌ల్ల మృతిచెందారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 59,449కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
మంగళవారం ఒక్క‌రోజే 8,23,992 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25 వ‌ర‌కు మొత్తం 3,76,51,512 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.