మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:23 IST)

తెలంగాణ సచివాలయ నిర్మాణానికి గడువు ఏడాది

రాష్ట్ర నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు గుత్తేదారు ఒప్పందం చేసుకున్న రోజు నుంచి ఏడాది వ్యవధిలో నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

నిర్మాణ గుత్తేదారును ఎంపిక చేసేందుకు టెండరు నోటిఫికేషన్‌ను రాష్ట్ర రహదారులు- భవనాల శాఖ జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబరు ఒకటో తేదీలోగా ఆసక్తిగల గుత్తేదారుల నుంచి టెండర్లను స్వీకరించనున్నట్లు టెండరు పత్రాల్లో పేర్కొంది. వచ్చే నెల అయిదో తేదీన నిర్మాణదారును ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

నిర్మాణ వ్యవధి పెంపుదలకు అవకాశం లేదని పేర్కొంది. నిర్ధారిత గడవులోగా పనిని పూర్తి చేసేందుకు 365 రోజులు 24 గంటలూ పనులు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించింది. టెండరు దాఖలు చేసే గుత్తేదారు సంస్థ గడిచిన అయిదేళ్ల వ్యవధిలో ఇలాంటి నిర్మాణాలు మూడు చేసి ఉండాలని పేర్కొంది. కనీసం రూ.100 కోట్ల విలువైన పది అంతస్తుల భవనాన్ని నిర్మించిన అనుభవం ఉండాలంది.

గుత్తేదారు కంపెనీ నికర విలువ రూ.750 కోట్లుగా ఉండాలని, ఏదైనా రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ. 500 కోట్ల మేరకు లావాదేవీలు నిర్వహించి ఉండాలని స్పష్టం చేసింది. ఎంపికైన గుత్తేదారునకు ముందస్తు నగదు చెల్లింపునకు అవకాశం లేదని పేర్కొంది.

సచివాలయ ప్రాంగణంలోని పచ్చదనాన్ని పరిరక్షించాలని.. చెట్లు, మొక్కలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించకూడదని తెలిపింది. నిర్మాణానికి ప్రతిబంధకంగా ఉన్నాయని భావించిన పక్షంలో రహదారులు-భవనాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తప్పదని నిర్ధారించిన పక్షంలోనే దాన్ని తొలగించాలని పేర్కొంది. గుత్తేదారు ఖర్చులతోనే మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని టెండరు పత్రాల్లో వివరించింది.