బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:03 IST)

దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు

తెలంగాణకు చెందిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలు టీఆరెస్, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఈ స్థానంలో పోటీ చేసేందుకు 46 మంది నామినేషన్లు సమర్పించారు. ఈనెల 17న చేపట్టిన పరిశీలనలో 12 మంది నామినేషన్లను తిరస్కరించారు. 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న 23 మందిలో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు.

2018 డిసెంబరులో జరిగిన ఎన్నికలో ఈస్థానం నుంచి 15 మంది పోటీ చేయగా.. టీఆరెస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నవంబరు 3న ఉప ఎన్నిక జరగనుంది. టీఆరెస్, కాంగ్రెస్‌, బీజేపీ కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచార జోరును మరింత పెంచారు. టీఆరెస్ తరఫున మంత్రి హరీశ్‌రావు అంతా తానై శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. సోలిపేట సుజాత ఈ నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు నమోదు చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు స్థానికంగానే మకాం వేసి మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు పోటీ చేసిన రఘునందన్‌రావు మూడోసారి బరిలో ఉన్నారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని దుబ్బాక ఓటర్లను కోరుతున్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం తారస్థాయికి చేరుతోంది. సవాళ్లు, విమర్శలతో నేతలు రాజకీయ వేడి పెంచుతున్నారు.