దుబ్బాక ఎమ్మెల్యే మృతి
తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు. ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి.
రామలింగారెడ్డి తొలుత పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేశారు. అప్పటి పీపుల్స్‌వార్ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం.
2004లో రామలింగారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008 (బై ఎలక్షన్స్), 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
రామలింగారెడ్డికి భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి అంచనాల కమిటీ చైర్మన్ పదవి చేపట్టిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది.