శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (08:35 IST)

నేడు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర - ఆ మూడు జిల్లాలకు సెలవు

khairatabad ganesh shobhayatra
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానుంది. గత నెల 31వ తేదీన ప్రతిష్టించిన ఈ గణేషుడు గత తొమ్మిది రోజులుగా వివిధ రకాలైన పూజలు అందుకున్నారు. శుక్రవారం గంగమ్మ చెంతకు చేరనున్నారు. దాదాపు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ విగ్రహాన్ని తరలించేందుకు ఈ యేడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. 
 
50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా కొలువుదీరిన ఈ గణేశుని శోభాయాత్ర ఖైరతాబాద్ సెన్షన్ థియేటర్, ఐఐఎంసీ కాలేజీ కూడలి, టెలిఫోన్ భవన్, ఓల్డ్ సెక్రటేరియట్ గేట్, తెలుగు తల్లి ఫైఓవర్ చౌరస్తా, లుంబనీ పార్కు మీదుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంటుంది. మొత్తం 2.5 కిలోమీటర్ల మేరకు ఈ గణేశుడి శోభాయాత్ర సాగి మధ్యాహ్నం 3 గంటల లోపు గణేషుడిని గంగలో నిమజ్జనం చేయనున్నారు.
 
మరోవైపు, గణేష్ నిమజ్జనం కారణంగా కాళోజీ నారా‌య‌ణ‌రావు ఆరోగ్య విశ్వవి‌ద్యా‌లయ పరి‌ధిలో వైద్య విద్యా‌ర్థు‌లకు నేడు నిర్వహించాల్సిన పరీ‌క్షలు వాయిదావేశారు. గణేశ్‌ నిమ‌జ్జనాన్ని పుర‌స్కరించు‌కొని ప్రభుత్వం సెలవు ప్రక‌టిం‌చ‌డంతో ఈ నిర్ణయం తీసు‌కు‌న్నట్లు అధికారులు వెల్లడించారు. 
 
శుక్రవారం జర‌గా‌ల్సిన ఎంబీ‌బీ‌ఎస్‌ మైక్రో బయా‌లజీ పరీ‌క్షను ఈ నెల 19న, బీడీ‌ఎస్‌ పెరియోడెంటా‌లజీ పరీ‌క్షను 21న, పోస్ట్‌ బేసిక్‌ నర్సింగ్‌ పరీ‌క్షను 30న నిర్వహించ‌ను‌న్నట్టు తెలి‌పారు. సెప్టెంబర్‌ 12 నుంచి జరిగే పరీ‌క్షల్లో ఎటు‌వంటి మార్పులు ఉండ‌వని పేర్కొ‌న్నారు.
 
అలాగే, ఈ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించింది. దీనికి బదులుగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళశాలలకు నవంబర్‌ 12 (రెండో శనివారం)ను పనిదినంగా పేర్కొన్నది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.