మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ?
తెలంగాణలోనే కాదు పక్కనున్న మహారాష్ట్రలో కూడా గులాబీ జెండా ఎగరేయాలన్న ఉత్సాహంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున పోటీకి కసరత్తు చేస్తోంది.
5 జిల్లాల్లోని 8 నుంచి 13 నియోజకవర్గాల్లో పోటీకి సై అంటోంది. కేసీఆర్ కూడా ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల వ్యూహంపైనా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు.
ఇక్కడ అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, తమ గ్రామాల్ని మహారాష్ట్ర నుంచి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. తమకు అవకాశం ఇస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఫామ్‌పై పోటీ చేస్తామని విజ్ఞప్తి చేశారు.
బాబ్లీ సర్పంచ్ గణపతిరావ్ కదమ్ కొన్నాళ్లుగా తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలంటూ ఉద్యమం చేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్, బీవండి, షోలాపూర్, రజుర నియోజకవర్గాలకు చెందిన కొందరు నాయకులు మంగళవారం హైదరాబాద్ వచ్చారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ వీరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశం ఆసక్తికరంగా సాగింది. ‘తెలంగాణ పథకాలు తమకు అమలు చేయాలి, లేదంటే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలి’ అనే నినాదంతోనే తాము ఎన్నికలకు వెళ్తామని వారు కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
వచ్చిన వారంతా దాదాపు నాందేడ్ జిల్లాకు చెందిన నేతలే కావడం, పైగా సరిహద్దు నియోజకవర్గాలతో తెలంగాణ ప్రజలకు వ్యాపార సంబంధాలు, ఇతరత్రా రాకపోకలు కూడా బాగానే ఉండడంతో పోటీకి సరేనన్నారు కేసీఆర్. ఐతే.. వారు ప్రతిపాదించిన అన్ని చోట్లా పోటీపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.
ప్రాథమికంగా జరిగిన చర్చల ప్రకారం నాందేడ్ జిల్లాలోని 5 చోట్ల టీఆర్ఎస్ బీఫామ్‌పై పోటీ చేస్తారు. పొరుగు జిల్లాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు కూడా పార్టీ టికెట్ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఒకవేళ స్థానికుల నుంచి మంచి మద్దతే ఉంటే మొత్తం 15 స్థానాల వరకూ పోటీ చేసే వీలుంది.