ఇళ్లు ఊరకే రావు.. దేవుడి దయ ఉంటేనే వస్తాయి : తెరాస మంత్రి శ్రీనివాస్

srinivas goud
ఠాగూర్| Last Updated: బుధవారం, 16 డిశెంబరు 2020 (15:42 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒకటి. ఈ ఇళ్ళను దశల వారీగా లబ్దిదారులకు ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావని ఆయన స్పష్టం చేశారు. కడుతున్న ఇళ్లు తక్కువ అని... ఆ ఇళ్లను కూడా లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. దేవుడి దయ ఉంటేనే ఇల్లు వస్తుందని అన్నారు.

దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా లక్షలాది ఇళ్లను కట్టి ఇవ్వలేదని చెప్పారు. ప్రతి ఏటా కొన్ని ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. దేవుడి దయ ఉంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు వస్తుందని అన్నారు. దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలని... అదృష్టం ఉంటే ఒక ఏడాదిలోనే ఇల్లు రావచ్చని చెప్పారు. పదేళ్లకో, 15 ఏళ్లకో అందరికీ ఇల్లు వస్తాయని అన్నారు.

అంతకుముందు హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం జైభ‌వాని న‌గ‌ర్‌లో నిర్మించిన 324 డబుల్‌ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి వాటిని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల తాళం చెవులు అందజేశారు.

ఈ కార్యక్ర‌మంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం కూడా పాల్గొన్నారు. ఈ ఇళ్లను రూ.28 కోట్ల వ్యయం 2 ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి భవనాలు పేదలకు నిర్మించి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా రెండు బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు.

సాధారణంగా వనస్థలిపురంలో ఇదే ఇల్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.50 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. పేదలకు తమ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

దీనిపై మరింత చదవండి :