బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (15:13 IST)

వైఎస్ఆర్ నరరూప రాక్షసుడు : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఓ నరరూప రాక్షసుడు అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. కానీ, ఆయన తద్విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. 
 
'తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్‌ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు. సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలున్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.