దినదిన గండంగా ఆర్టీసీ ప్రయాణం : బస్సు బోల్తాపడి 30 మందికి గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలనే ప్రాణాలపై ఆశలు వదిలేసుకుని బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ధవళేశ్వరం వంతెనపై వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయపటపడ్డారు.
ఈ ఘటనను మరచిపోకముందే తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన మర్పల్లి మండలం కల్కొడ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూరు వైపు వెలుతున్న ఆర్టీసీ బస్సు కల్కొడ వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 30 మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మర్పల్లి నుంచి వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని ప్రయాణీకులు చెబుతున్నారు. మలసోమారం, పెద్దాపూర్, ఇందోల్, తాండూర్, సదాశివపేట్, మొరంగపల్లి, కొడంగల్, జహీరాబాద్, పద్దేముల్, కేశారం గ్రామాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.