శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (17:59 IST)

జాతీయ విద్యా విధానంతో భారత్ కు విశ్వగురువు స్థానం: గవర్నర్

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020 సమర్ధవంతమైన అమలుతో భారత్ విశ్వగురువుగా అవతరిస్తుందని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

భారతీయ మూలాల ఆధారంగా ఆధునిక ప్రపంచ అవసరాలకనుగుణంగా రూపొందిన ఈ జాతీయ విద్యా విధానంతో విద్యారంగంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. 
 
విద్యాభారతి సంస్థ ఈ నూతన విద్యా విధానంపై విద్యార్థులలో అవగాహన పెంచడానికి, వారిని చైతన్యవంతం చేయడానికి ‘మై ఎన్ ఈ పి’ అనే కార్యక్రమం ద్వారా పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని గవర్నర్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధాన రూపకర్తలైన ప్రముఖ సైంటిస్ట్ డా. కస్తూరి రంగన్ ఇతర సభ్యులు విద్యారంగంలో భారత్ కు ప్రాచీన కాలం నుండి ఉన్న గొప్ప పేరును, వైభవాన్ని తిరిగి సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఎన్ ఈ పి – 2020 ప్రవేశపెట్టారని డా. తమిళిసై వివరించారు. 

విద్యారంగంలో మౌళికమైన, సమూల మార్పుల ద్వారా ఆధునిక సాంకేతిక యుగానికి సంబంధించి వివిధ రంగాలలో భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నారు. 

వివిధ రంగాల సమ్మిళిత పరిశోధనా పద్ధతులు, వృత్తి విద్య, ప్రాక్టికల్ విద్యావిధానం, ఆవిష్కరణల ప్రోత్సాహం, ప్రపంచస్థాయి ఆధునిక విద్యా పద్ధతులు ఈ జాతీయ విద్యావిధానంలో ఉండటం ఆహ్వానించతగ్గ అంశాలన్నారు. 

భారత్ ను విజ్ఞాన-ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా మార్చడం, నాలెడ్జ్ సూపర్ పవర్ గా తీర్చిదిద్ధడం అన్న స్పష్టమైన లక్ష్యాలతో వచ్చిన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని సమర్ధవంతమైన అమలు కోసం అందరూ భాగస్వాములు కావాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు. 

ఈ జాతీయ విద్యా విధానం – 2020 పై విస్తృత అవగాహన విద్యార్ధులలో కల్పించడానికి ‘మై ఎన్ ఈ పి’ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యాభారతి కృషిని గవర్నర్ అభినందించారు.