మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:49 IST)

7న నూతన విద్యా విధానంపై గవర్నర్ల సదస్సు

ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై నిర్వహిస్తున్న గవర్నర్ల సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆహ్వానం పలికారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 7న ఈ కార్యక్రమం జరగనుండగా, అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం గవర్నర్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై చర్చించారు. 7వ తేదీ నాటి సదస్సులో అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. గవర్నర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేష్ పోఖ్రియాల్ పాల్గొననుండగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేస్తారు.

సమావేశంలో అన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యదర్శులు పాల్గొననున్నారు.

వర్చువల్ విధానంలో ఎక్కడి వారు అక్కడే ఉండి ఈ సదస్సులో తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేకించి నూతన విద్యావిధానంపై అమలుపై లోతైన చర్చకు నిర్ధేశించారు.