1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (09:36 IST)

వైరస్ ల మీద ప్రభావం చూపే సార్వత్రిక వ్యాక్సిన్: ఉపరాష్ట్రపతి

టీకా మరియు ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు వివిధ కోవిడ్ రకాల జన్యుశ్రేణి పరిశోధన ముమ్మరం చేసి, త్వరితగతిన గుర్తించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని సి.సి.ఎం.బి.కి చెందిన అంతరించినపోతున్న జంతు జాతుల పరిరక్షణ ప్రయోగశాళ (లాకోన్స్)ను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా లాకోన్స్ సైంటిస్ట్ ఇన్ చార్జ్ డా. కార్తికేయన్ వాసుదేవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉపరాష్ట్రపతికి తమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం లాకోన్స్ సంస్థ ప్రాంగంలోనే ఉన్న జాతీయ వన్యప్రాణుల జన్యు వనరుల బ్యాంక్(నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్), సహాయ పునరుత్పత్తి ప్రయోగశాల (అసిస్టెడ్ రిప్రొడక్షన్ ల్యాబ్), జంతువుల నివాసాలను ఉపరాష్ట్రపతి సందర్శించారు.
 
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మరియు పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, కొత్త వైరస్ ఉత్పరివర్తనాల ఆవిర్భావాన్ని గుర్తించడంలో సీక్వెన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తద్వారా కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని ఎదుర్కొనేందుకు, సకాలంలో సరైన వైద్య సహాయం అందించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
 
దేశంలోని కొన్ని జంతు ప్రదర్శనశాలల్లో ఉన్న కొన్ని జంతువులకు కోవిడ్ -19 వైరస్ సంక్రమించిన నివేదికల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఇలాంటి వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సోకుతున్న నేపథ్యంలో, కోవిడ్ కొత్త రకాల పరిశోధనలను పూర్తి చేయడం ద్వారా, ఈ మహమ్మారి మీద మనం సాగిస్తున్న పోరాటాన్ని వేగవంతం చేయవచ్చని తెలిపారు.

వివిధ సార్స్ కోవ్ -2 వేరియంట్లను ఎదుర్కోగల సార్వత్రిక వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయవలసి అవసరం ఉందని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.
 
వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహల నుంచి బయట పడాలని ప్రజలకు సూచించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు మరింత సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలన్న ఆయన ఈ దిశగా ఇతరులను ప్రోత్సహించాలని తెలిపారు.

సాంస్కృతిక, క్రీడా ప్రముఖులు టీకాకరణలో చురుకైన భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, టీకాకరణ జాతీయ ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.
 
కోవిడ్ -19కు వ్యతిరేకంగా భారతదేశం సాగించిన పోరాటంలో సి.సి.ఎం.బి. పాత్రనుఅభినందించిన ఉపరాష్ట్రపతి, సంస్థల మధ్య బలమైన సహకారాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. లాకోన్స్-సి.సి.ఎం.బి. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో కలిసి పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఇలాంటి సంస్థలు అంటువ్యాధులు మరియు భవిష్యత్ లో ఎదురుకాబోయే మరిన్ని మహమ్మారుల నివారణకు కృషి చేయాలని తెలిపారు.
 
జూలోని జంతువులు మరియు జంతు ప్రదర్శనశాల ముందు వరుస కార్మికుల కోసం సెంట్రల్ జూ అథారిటీ మరియు అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో లాకోన్స్ ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

చాలా సులభంగా సోకే కరోనా వైరస్ వ్యాప్తి అనేక సవాళ్ళకు కారణమౌతుందన్న ఉపరాష్ట్రతి, కొత్త రకాల మీద పరిశోధనలో సి.సి.ఎం.బి. ముందడుగు వేయగలదని, పరిశోధనల్లో ఆశాజనక అంశాలను వెలువరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక బయోటెక్నాలజీ సాధనాలను అభివృద్ధి చేసిన లాకోన్స్ ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, సహాయక పునరుత్పత్తి మరియు ఫోరెన్సిక్ లతో సహా బ్లాక్ బక్, మచ్చల జింక, రాక్ పావురం, అంతరించిపోతున్న ఎలుక జింకల విజయవంతమైన పునరుత్పత్తి గురించి ప్రస్తావించారు. కాశ్మీర్ లోని హంగూల్ జింకలు, చత్తీస్ ఘడ్ లోని అడవి గేదెలు, డార్జిలింగ్ లోని రెడ్ పాండాల విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు మరింత విస్తరించాలని సూచించారు.
 
లాకోన్స్ లోని జాతీయ వన్యప్రాణుల జన్యు వనరుల బ్యాంక్(నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్) ప్రపంచంలో 23 ల్యాబ్  ప్రత్యేకమైన లీగ్ లలో ఒకటి కావడం సంతోషకరమన్న ఉపరాష్ట్రపతి, లాకోన్స్ కార్యకలాపాల గురించి ప్రస్తావించారు.