మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 29 జులై 2017 (07:33 IST)

అమ్మలాంటి పార్టీని వదులుకోవడం బాధాకరం..ఈ వయసులో ఆరోపణలు బాధిస్తున్నాయ్: వెంకయ్య ఆవేదన

అమ్మలాంటి పార్టీని ఉపరాష్ట్రపతి పదవికోసం వదులుకోవడం, ఈ వయసులో తన కుటుంబ సంస్థపై ఆరోపణలు చేయడం రెండూ బాధ కలిగిస్తున్నాయని ఎన్టీఏ తరపున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం పొడవునా తనను ఆదరించిన పార్టీ

అమ్మలాంటి పార్టీని ఉపరాష్ట్రపతి పదవికోసం వదులుకోవడం, ఈ వయసులో తన కుటుంబ సంస్థపై ఆరోపణలు చేయడం రెండూ బాధ కలిగిస్తున్నాయని ఎన్టీఏ తరపున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం పొడవునా తనను ఆదరించిన పార్టీని తల్లిలాగే భావిస్తానని, పార్టీ పదవులను వదులుకుంటున్న క్షణాన ప్రధాని మోదీ నన్ను కన్నీటితోనే ఓదార్ఛారని  తెలిపారు. 
 
క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకొని ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న వెంకయ్యనాయుడుకు హైదరాబాద్‌లో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ  సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ  పార్టీని తల్లిలా భావిస్తానని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని, అవే వచ్చాయన్నారు. కేంద్రమంత్రిగా పనిచేస్తున్నప్పుడే పార్టీ తనను జాతీయ ఉపాధ్యక్షుడిని చేసిందని, అలాగే చిన్నతనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అన్నారు. అమ్మలాంటి పార్టీని వదిలిపెట్టడం బాధగా అనిపించిందన్నారు. ప్రధాని మోదీ నన్ను కన్నీటితో ఓదార్చారన్నారు.
 
2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పదవిలో ఉండగానే రాజకీయాలు వదిలి సామాజిక సేవలో పాల్గొంటానని వెంకయ్య తెలిపారు. ఇక  రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తన పిల్లలకు ముందే చెప్పానని వెంకయ్య నాయుడు అన్నారు. తన కుమారుడు చేసే వ్యాపారాలు ఏంటో తనకు తెలియదన్నారు. కొంతమంది స్వర్ణభారతి ట్రస్ట్‌‌పై చేస్తున్న ఆరోపణలు బాధ కలిగించాయని వెంకయ్య పేర్కొన్నారు.
 
కాగా నగరంలో ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందన సభకు ఐటీ మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల, మాజీ డీజీపీలు రాముడు, దినేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్‌, నాగార్జున. అల్లు అరవింద్‌, సుద్దాల అశోక్‌తేజ, మురళిమోహన్‌, సుజనాచౌదరి, జేపీ తదితరలు పాల్గొన్నారు.
 
తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడికి రెండో రాజ్యాంగ అత్యున్నత పదవిని కట్టబెట్టడం వ్యక్తిగతంగా తనకు గర్వకారణమే కావచ్చు. కానీ ఏపీ రాజకీయాల్లో తలదూర్చుతున్నారని, చంద్రబాబుకు అన్నీ తానే ఢిల్లీ లెవల్లో సహకరిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలను దీర్ఖకాలంగా అడ్డుకున్నారని ఇలా పలు కారణాలు ఆయనను పార్టీకి దూరం చేశాయని చెప్పడంలో నిజాలు ఏవో తెలియదు కానీ రాజకీయమే ఊపిరిగా అద్బుత మైన గొంతుబలంతో రాణించిన వెంకయ్య ఇప్పుడు ఆ వాణికే దూరమయ్యారు. ఇకపై ఆయన స్వరం రాజ్యసభలోనే మాత్రమే వినిపిస్తుంది.
 
ఏదేమైనా..చంద్రబాబుకు కుడిభుజం పోయిందన్నది మరీ వాస్తవం.