గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (19:12 IST)

తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలు.. కోమటిరెడ్డి Vs జగ్గారెడ్డి

తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.

తాజాగా పీసీసీ చీఫ్‌ పదవి తనకే వచ్చే అవకాశముందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పీసీసీ ఎంపికపై రెండ్రోజుల్లో ప్రకటన కూడా వెలువడుతుందన్నారు. సీనియర్ నేతగా.. పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా తనకే పీసీసీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు పీసీసీ ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
 
ఇక పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ రేసులో తానూ ఉన్నానని.. కానీ ఢిల్లీలో అసలు తన పేరు ప్రస్తావనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఠాగూర్ చిన్న చూపు చూస్తున్నాడని.. ఉద్యమనేతగా, బలమైన వ్యక్తిగా ఎదిగినా గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ఎదుర్కొన్న ఏకైక వ్యక్తిగా తనకు గుర్తింపు ఉందని.. కేసీఆర్‌ను గద్దె దించే మెడిసిన్ తన వద్దే ఉందని జగ్గారెడ్డి చెబుతున్నారు. పీసీసీ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అనుసరిస్తానన్నారు.
 
మరోవైపు పార్టీ సీనియర్ నేతలపై వీహెచ్ హనుమంతరావు అలిగారు. పీసీసీ విషయంలో తనన కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పినా.. పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌కు రాకుండా ఇంట్లోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు వీహెచ్. అయితే వీహెచ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డిలు మద్దతుగా నిలిచారు. పార్టీ సీనియర్ నేతలను ఫోన్లో బెదిరించడాన్ని వారు ఖండించారు.