శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:50 IST)

విద్యార్థులతో షర్మిల భేటీ ఎందుకబ్బా?

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో బుధవారం వైఎస్‌ షర్మిల సమావేశం కానున్నారు. లోట్‌సపాండ్‌లో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు షర్మిల బృందం వెల్లడించింది.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తీరు తదితర అంశాలపైన విద్యార్థుల అభిప్రాయాలను ఆమె స్వీకరిస్తారు. కాగా, మంగళవారం ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి పలువురు అభిమానులు వచ్చి షర్మిలను కలిశారు. జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి కూడా షర్మిలను కలిసి, కాసేపు మాట్లాడారు.
 
కొత్తగా పార్టీ పెట్టబోతున్న వైఎస్‌ షర్మిలకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి ప్రభాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. ఇటీవలే షర్మిలను కలిసి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. మంగళవారం ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

షర్మిల సన్నిహిత బంధువు ఒకరు ఆయనతో పాటు ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిలకు మద్దతు తెలిపేందుకు, అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభాకర్‌రెడ్డి అంగీకరించారు.