గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (16:24 IST)

ప్రేమిస్తారు.. పెళ్లి చేసుకుంటారు.. పరాయి వ్యక్తి కోసం చంపేస్తున్నారు..

వివాహేతర సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. పరాయి వ్యక్తితో సుఖం కోసం కొందరు కట్టుకున్నవారినే కడతేర్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట శివారు కొత్తకుంటలో ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లాడిన భర్తనే ఓ మహిళ ప్రియుడితో కలిసి చంపేసింది. 
 
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి కడతేర్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ కసాయి భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మద్దూర్‌ మండలం హన్మతండాకు చెందిన భూక్యా మోహన్‌(33) దాదాపుగా పన్నెండేళ్ల క్రితం అదే తండాకు చెందిన భూక్యా వినోదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో వారు కుటుంబ పోషణ కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. మోహన్‌ ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి భార్య నిర్మాణ పనులకు కూలీగా వెళ్లేది. అక్కడ రాజు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
అయితే వారు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మోహన్‌ను చంపాలని ప్లాన్ చేశారు. దీంతో నవంబరు 10న మోహన్‌కు వారిద్దరు కలిసి బాగా మద్యం తాగించారు. అనంతరం మరుసటి రోజు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మోహన్‌ను బైక్ పై ఎల్లారెడ్డిపేట శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ మోహన్‌కు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. 
 
అనంతరం శవాన్ని కొత్తకుంటలో పడేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందుతులు వినోద, రాజు అని తేలడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.