గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (19:13 IST)

చిరంజీవికి విలన్‌గా రెహ్మాన్ - స్క్రిప్టు సిద్ధం చేసిన ఆ ఇద్దరు దర్శకులు!!!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేయగా, మూడో చిత్రంగా "ఆచార్య" పట్టాలపైవుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. 
 
ఈ క్రమంలో నాలుగో చిత్రంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన "లూసిఫర్" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి 'సాహో' దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి విలన్ పాత్రధారిని ఎంపిక చేయడం కూడా కష్టంగా మారింది. 
 
ఎందుకంటే, ఆయన ఇమేజ్‌కి, పాప్యులారిటీకి సరితూగే ఆర్టిస్టు దొరకాలి. అందులోనూ కొత్తదనం కనపడాలి. తాజాగా అలాంటి అవకాశం ప్రముఖ నటుడు రెహ్మాన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న చిరంజీవి దీని తర్వాత మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'లో నటించనున్న సంగతి విదితమే.
 
'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో యంగ్ హీరో పాత్రకి విజయ్ దేవరకొండను తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అలాగే తాజాగా ప్రధాన విలన్ పాత్రకు గాను రెహ్మాన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ పాత్రను పోషించాడు. 
 
ఇదిలావుండగా, ప్రస్తుతం 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి తన తదుపరి చిత్రాలకు కూడా మరోపక్క ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సుజీత్, బాబి, మెహర్ రమేశ్ వంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి లైన్లో వున్నారు. ఎవరికి వారు తమ కథలను సిద్ధం చేస్తున్నారు. 
 
లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఖాళీ సమయంలో చిరంజీవి వీరి కథలను వింటూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఓపక్క సుజీత్ దర్శకత్వంలో మలయాళ సినిమా 'లూసిఫర్' చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
 
ఇదేసమయంలో బాబీ కూడా తన కథను సిద్ధం చేశాడట. చిరంజీవి చేసిన సూచనల ప్రకారం పూర్తి కమర్షియల్ హంగులతో స్క్రిప్టును తయారుచేసినట్టు తెలుస్తోంది. చిరంజీవిని ప్రేక్షకులు ఏ తరహా పాత్రలో చూడాలని కోరుకుంటారో అలాంటి పాత్రతో ఈ కథను రెడీ చేశాడట.