చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ... ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో విజయ్ తదుపరి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
దర్శకుడు క్రాంతి మాధవ్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాలో చాలా ప్రేమకథలు ఉంటాయని తెలిసింది. రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నలుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కూడా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. కాలేజ్ స్టూడెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బైక్ రేసర్, మధ్య తరగతి వ్యక్తి పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడట.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమా కథ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా కథలా ఉంటుందట. ఇందులో చరణ్ ప్రేమిస్తాను కానీ... ఎప్పటికీ ఒకేలా ప్రేమించలేను అంటుంటాడు. విజయ్ కూడా ఇందులో అలాగే అంటుంటాడని టాక్ వినిపిస్తోంది. మరి... ఇదే కనుక నిజమైతే ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో..?