తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం
"కృష్ణ" అనే తెలుగు చిత్రంలో విలన్ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మృతి చెందారు. ఈ బాలీవుడ్ నటుడు వయసు 54 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెల్లడించారు.
కాగా, సింహాద్రి, సీతయ్య, అతడు వంటి పలు చిత్రాల్లో నటించిన ముకుల్ దేవ్... సీరియల్ నటుడుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.
"దస్తక్"తో నటుడుగా వెండితెరకు పరిచయమైన ఆయన బాలీవుడ్‌లోనేకాకుండా, తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటించారు. రవితేజ హీరోగా నటించిన "కృష్ణ" చిత్రంలో విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆలరించారు. ఆ సినిమా తర్వాత కేడీ, అదుర్స్, సిద్దం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన అంత్ ది ఎండ్ తర్వాత ఆయన నటించలేదు.