ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (10:17 IST)

నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు, అసలు హార్ట్ ఎటాక్‌కి కారణాలు ఏమిటి?

Shreyas Talpade
ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకి గురయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీనితో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా వుంది.
 
ఇటీవలే ఏపీ మంత్రి గౌతంరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. చాలా తక్కువ వయసులోనే ఇలా గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆమధ్య కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు. కొంతమందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వ‌ల్ల ఎంతో విలువైన ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వీలుంటుంది.
 
జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
 
హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యుడిని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
 
మ‌త్తుమ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి.
 
ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి. చాలామంది గుండె నొప్పి ప్రారంభ లక్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరపడుతుంటారు. కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు.
 
కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి. శ‌రీరం పైభాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. అంతేకాదు ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.
 
గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్‌ను కూడా గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. నిర్లక్ష్యం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కో అడుగు దగ్గర అవుతున్నట్టే…
 
గుండె ఆరోగ్యానికి ఏం చేయాలి?
వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వీలైనప్పుడంతా నడవడం, మెట్లు ఎక్కడం ద్వారా గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి. గుండె కూడా కండరమే. దీనికి ప్రోటీన్స్ అవసరమే. కాబట్టి చిక్కుడు, బఠాణీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజపప్పులు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అధిక బరువు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి.