ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 15 నవంబరు 2022 (10:38 IST)

టాలీవుడ్‌కు ఘనమైన చిత్రాలు అందించిన జంట కృష్ణ - జయప్రద

krishna jayaprada
తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్నో ఘనమైన సూపర్ హిట్ చిత్రాలు అందించిన సూపర్ హిట్ జంటగా సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ జయప్రదకే దక్కింది. వీరిద్దరు కలిసి ఏకంగా 45 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇలా ఒకే హీరోతో ఒక హీరోయిన్, లేదా ఒక హీరోయిన్‌తో ఒకే హీరో ఇన్ని చిత్రాల్లో నటించిన దాఖలాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మరెవ్వరూ లేరనే చెప్పాలి. 
 
"శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్" అనే చిత్రంలో తొలిసారి జంటగా నటించిన జయప్రద ఆ తర్వాత కృష్ణ సరసన ఏకంగా 45 చిత్రాల్లో నటించారు. అలా, జయప్రదకు సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ ఇచ్చారు. ఈమెకే కాదు అనేక మంది హీరోయిన్ల ఎదుగుదలలో కృష్ణ కీలక భూమికను పోషించారు. 
 
ఎన్నో సందర్భాల్లో కృష్ణ తనకు అందించిన సహకారం గురించి జయప్రద గుర్తు చేసేవారు. తాము పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత కృష్ణ తనకు ఎంతో మద్దతు ఇచ్చారని చెబుతుంటారు. బాబు దర్శకత్వం వహించి విజయా సంస్థ నిర్మించి "శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్" చిత్రంలో తొలిసారి కృష్ణ సరసన నటించినట్టు చెప్పారు. 
 
ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ జయప్రదకు కృష్ణ అండగా నిలిచారు. ఆ తదుపరి తాను నటించే చిత్రాల్లో ఆమెకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ జయప్రదను స్టార్ హీరోయిన్‌ను చేశారు. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు నేటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.