అందమైన రాణికి ఐశ్వర్యా రాయ్
దర్శక దిగ్గజం మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వం. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. ఇది రెండు భాగాలుగా రానుంది. అనేక స్టార్ నటీనటులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ ఒకరు. ఈ చిత్రంలో ఈమె అందాల రాణిగా కనిపించనున్నారు.
తాజాగా పీఎస్-1లో ఐష్ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 47 ఏళ్ల ఐష్.. అందమైన రాణి గెటప్‌లో పట్టు ఎర్రచీర, నగలతో మెరుస్తూ కనిపిస్తోంది. ఇటీవలే పుదుచ్చేరిలో జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది.
కాగా ఈ చిత్రం తొలిభాగం 2022లో విడుదలకానుంది. ప్రముఖ నటులు విక్రమ్, కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్, జయం రవి తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్ సమర్పణలో మణిరత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్. రెహమాన్, కళ: తోట తరణి,కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్.
ఇదిలావుంటే, మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యా రాయ్ నటిస్తున్న నాలుగో చిత్రం ఇది. గతంలో 1997లో విడుదలైన ఇరువర్ చిత్రంతో ఐష్‌ను తమిళ చిత్ర సీమకు దర్శకుడు మణిరత్నం పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి కలయికలో.. 2007లో వచ్చిన గురు, 2010లో వచ్చిన రావణ్ వచ్చాయి. పదేళ్ల తర్వాత.. నాలుగోసారి వీరిద్దరూ పొన్నియిన్ సెల్వన్‌తో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు.