సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (12:06 IST)

మనసుకు దురదపుడితే దేనితో గోక్కోగలం?... త్రివిక్రమ్ ప్రశ్న

డైరెక్టర్ త్రివిక్రమ్ తాజా చిత్రం అల వైకుంఠపురములో... ఈ చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటించాడు. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ తనదైనశైలిలో మాట్లాడారు. ముఖ్యంగా, అల వైకుంఠపురములో పాటలు ఇలా సూపర్ హిట్ కావడం వెనుక ఎంతో మంది కృషి దాగివుందన్నారు. 
 
'రెండు పదాలే అన్న శ్యామ్ గారు రాములో రాములా పాటను ఎక్కడికో తీసుకెళ్లారు. ఓ మైగాడ్ డాడీ అన్న కృష్ణచైతన్య, ఓ సందర్భం గురించి ఫోనులో చెప్పగానే ర్యాప్ వెర్షన్ రాసి పాడి ఫోనులో పంపిన రోల్ రైడాను అభినందిస్తున్నాను. 
 
ఇక సంగీతం గురించి నా అభిప్రాయం చెబితే నవ్వు రావొచ్చేమో కానీ చెబుతాను. మనసు దురద పెడితే గోక్కునే దువ్వెన లాంటిది సంగీతం. తల దురదపెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసుకు దురదపెడితే దేనితో గోక్కోగలం... సంగీతంతో తప్ప!' అంటూ చెప్పుకొచ్చారు. 
 
అలాగే, చిత్ర హీరో అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ, 'జులాయి' సమయంలో పెళ్లికానీ యువకుడిగా బన్నీ నాకు తెలుసు. ప్రస్తుతం పెళ్లై ఇద్దరు బిడ్డల తండ్రిగా తన మాటలో, పనిలో, ప్రయాణంలో పరిణితి కనిపిస్తుంది. ఈ సినిమాతో మేము కన్న కల మీ అందరికి మంచి జ్ఞాపకం అవ్వాలని, ఆనందాన్ని ఇవ్వాలని కష్టపడ్డాం. ఈ సినిమాలో పనిచేసినా నటులంతా నాకు ఇష్టమైన వాళ్లే. నా మనసుకు తాకినా వాళ్లే. 
 
సినిమా విడుదల తర్వాత కొద్దిపాటి విరహాన్ని అనుభవించి మళ్లీ కథ రాసి నటులందరిని కలుస్తాను. ఈ సినిమాకు ఆది, అంతం రెండు అల్లు అర్జున్‌. సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఆనందంగా ఉందాం, హ్యాపీగా చేద్దాం ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు అన్నారు. ఆ ఆనందం అనే మాటను ఈ సినిమా ప్రయాణంలోని పదకొండు నెలలు ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ అల్లు అయాన్‌, బ్రిలియెంట్‌ యాక్టర్‌ అల్లు అర్హ కూడా నటించారు’ అని తెలిపారు. 
 
ఇకపోతే, తనకు అత్యంత శ్రేయోభిలాషి, ఆప్తుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆకాశానికెత్తేశారు. సినిమా గీత రచయితకు సాహితీవేత్త స్థాయి కల్పించిన రచయిత అని కొనియాడారు. ఒకటి నుంచి పది స్థానాలు ఆయనవేనని, ఆ తర్వాత 11 నుంచే ఇతర గీత రచయితలు ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే ఇతర గీత రచయితలు కూడా సిరివెన్నెల సరసన నిలవాలని, తప్పకుండా నిలుస్తారని ఆకాంక్షించారు.